ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని, అలాగే వీలైనంత వరకు సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. కురుపాం మండలంలోని ఉదయపురం గ్రామాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అక్కడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధిక మోతాదులో ఎరువుల వినియోగం వలన పంటకు, ఆరోగ్యానికి హానికరమని అన్నారు. కావున నిర్దేశించిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని, ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని సూచించారు. అధిక యూరియా వినియోగానికి బదులుగా నానో మరియు ఇతర జీవన ఎరువులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.