విశాఖపట్నం పర్యాటక రంగానికి కొత్త కళను తీసుకొస్తూ రెండు అత్యాధునిక డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బీచ్ రోడ్డులో ప్రారంభించారు. ఈ బస్సులో ఒక టికెట్ తీసుకుంటే 24 గంటల పాటు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. దీని ధర రూ. 500గా నిర్ణయించగా, ముఖ్యమంత్రి దానిని సగానికి తగ్గిస్తూ అక్కడే కీలక ప్రకటన చేశారు. మిగిలిన 250 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ కింద భరిస్తుందని, పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. తరచూ ప్రయాణించే వారికి మరింత రాయితీ ఇచ్చే విషయం పరిశీలించాలని అధికారులకు సూచించారు.