జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది పరిస్థితిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఎగువ నుండి భారీగా వరద నీరు గోదావరిలోకి వస్తుండటంతో, అధికారులతో కలసి పరిస్థితిని సమీక్షించారు. ఎగువనున్న ఎస్సారెస్పీ , కడెం ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడి, వరద వస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. జిల్లాలో ఉన్న 8 గోదావరి తీర మండలాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద ముప్పు వాటిల్లితే, అక్కడి ప్రజలను తరలించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.