కడప జిల్లా కమలాపురం మండలంలో ప్రస్తుతం యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా సరఫరా చేస్తామని సోమవారం తహసీల్దార్ శివరాం రెడ్డి స్పష్టం చేశారు. వానాకాలం సాగు వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఎరువుల లభ్యతపై రైతుల్లో ఏర్పడుతున్న అనిశ్చితి దృష్ట్యా ఈ హామీ ఇస్తున్నట్లు చెప్పారు.కమలాపురం పట్టణంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా పంపిణీని తహసీల్దార్ స్వయంగా పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు అందుబాటులో ఎరువులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు ఎలాంటి అనవసర ఆందోళనకు లోనుకాకుండా, అధికారుల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.