మంచిర్యాల జిల్లా తాడ్లపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని తాడ్లపేట అటవీ రేంజ్ అధికారి వి. సుష్మ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. లింగాపూర్ బీట్, తాడ్లపేట రేంజ్ లో దండేపల్లి మండలం దమ్మన్నపేట, మామిడిగూడ ప్రాంతాల ఆక్రమణదారులు ప్రణాళికబద్ధంగా అటవీ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరమేశ్వర్, బేస్ క్యాంప్ వాచర్ రాజేందర్ లపై కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి మిర్చి పొడిని అటవీ సిబ్బంది కళ్ళపై బలవంతంగా రుద్దారని తెలిపారు.