విశాఖపట్నంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్ సహా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధురవాడ, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, ద్వారకానగర్, డాబాగార్డెన్స్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా, కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ పాఠశాలలు, కళాశాలలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు వర్షంలో తడిచి ఇళ్లకు చేరుకున్నారు. ఈ ఆకస్మిక వర్షం కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.