శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆగస్టు 13 నుండి 15 వరకు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక, చారిత్రక, ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు.