జిల్లాలోని వివిధ ఆశ్రమ పాఠశాలలతో పాటు పలు హాస్టల్లో ఉంటున్న పేద విద్యార్థులు నాణ్యమైన భోజనం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో కలుషితమైన ఆహారంతో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు ఆందోళన సైతం చేపట్టారు. తాజాగా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన దిగారు. తమకు అందిస్తున్న కిచిడీతో పాటు మధ్యాహ్న భోజనం అన్నంలో సైతం పురుగులు వస్తున్నాయంటూ బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ ప్లేట్లలో పురుగుల అన్నం చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.