ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, వంటశాల, భోజన నాణ్యత, విద్యా బోధన విధానం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్యను బోధించాలని, ముఖ్యంగా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.