నెలవారీ గా చిట్టీలు కట్టించుకుని ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఓ దంపతులు మోసం చేశారంటూ మంగళవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. కోతిరాంపూర్ కు చెందిన ఆంథోనీ జ్యోతి దంపతులు చిట్టీల పేరిట సుమారు 90లక్షల రూపాయలు వసూలు చేశారంటూ బాధితులు ఆరోపించారు. ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశారని మూడు సంవత్సరాలు అయినా ఆ చిట్టిల డబ్బులు ఇవ్వకుండా సదరు దంపతులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని డబ్బులు అడిగితే తమపైనే కేసులు పెట్టి, తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.