కరీంనగర్ లోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడడం తీవ్రమైన నేరమని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఆయన అన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లపై చేసే వేధింపులు, అసభ్యకర కార్యకలాపాలు చట్ట ప్రకారం శిక్షార్హమని ఆయన స్పష్టం చేశారు. అటువంటి చర్యలకు పాల్పడిన విద్యార్థులను విద్యాసంస్థల నుండి తొలగించడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.