చిత్తూరు జిల్లా, కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఐదవ రోజు అయిన ఆదివారం ఉదయం ప్రత్యేకంగా చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని శోభాయమానమైన అలంకారంలో చిన్న శేష వాహనంపై ఆరాధ్య రూపంలో వెలకట్టలేని వైభవంతో అలంకరించి, కాణిపాకం ప్రధాన వీధులలో విహరింపజేశారు. వాహన సేవలో పాల్గొన్న భక్తులు “గణనాథుడు శరణం” అంటూ జపించగా, పురవీధులంతా భక్తి రసమయం అయింది. వాహనంపై విహరిస్తున్న శ్రీ విజ్ఞ వినాయకుడిని చూడటానికి వేలాది మంది భక్తులు గుమిగూడారు.